Ramachakkani sita ki - GODAVARI movie రామచక్కని సీతకి by mee snehageetham



ఈ పాట తెలుగు సినీ చరిత్రలోని ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట. ఆ అధ్యయమే వేటూరి సుందర రామ మూర్తి గారు. ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి గారు, ఆయన రాసిన ఈ పాట. ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత తాదత్యం చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోత తో ఆనంద భాష్పాలు రాల్చే పాట.
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన ( రమ ) ఘన విచలన అంటే నెమ్మది గా/ భారం గా నడిచేది అని, ఇక్కడ నెమ్మది  గా అంటే సున్నితంగా, వయ్యారంగా, దీన్నే మార్చి మంద గమన అంటారు చివర్లో. ధరణిజ అంటే భూదేవి కి కూతురు, మధుర వదన, ఇందు వదన అన్ని సీతమ్మ వారికి ఉపమానలే. నలిన నయన అంటే పద్మము వంటి కనులు కలదానా అని. సీతమ్మ వారి గురించి ఇంత వివరించి, అటువంటి మా సీతమ్మ సీత మనవి వినవా రామ అని పాట ప్రారంభిస్తారు వేటూరి గారు. సీతమ్మ మనవి ఏంటి అనేది మనకి తెల్సిందే రాముడిని కలవాలని, చూడాలని.

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట  || రామచక్కని సీతకి ||


తెలుగు నాట గోరింటాకు పెట్టుకోవటం ఒక చెప్పలేని అనుభూతి. ప్రతి వనిత ఎంతో కష్టపడి ఆకులు కోసి ఆ ఆకులని రుబ్బి, ఇష్టపడి చేతికి పెట్టుకొనేది గోరింటాకు. ఇది పెట్టుకోనని మారాము చేసిన కన్యల కోసమే అన్నట్టు గోరింటాకు పండిన విధానంకి ఆ కన్యకి రాబోయే వరుడికి ముడి పెట్టి ప్రోత్సహిస్తారు పెద్దలు. ఆ కన్య తన ఊహల్లో తనకి వచ్చే రాకుమారుడిని ఊహించుకుంటూ పండిన చెయ్యిని చూస్తూ మురిసిపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడ, గన్నేరు లా పూస్తే కలవాడు వస్తాడు, సింధూరం లా పూస్తే చిట్టి చేయ్యంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు అన్నారు. వేటూరి గారిక్కడ రాముడు మెచ్చిన, రాముడికి నచ్చిన సీతకి అరచేత గోరింటాకు పెడితే ఆ గోరింటాకు పండిన చెయ్యి మెరిసిపోతే చక్కని సీతకి మొగుడు గా ఎవరు వస్తారో అని అడుగుతూనే  రాముడు కాక ఇంకా ఎవరు వస్తారు అని చెప్పకనే చెప్తారు రామచక్కని సీత అంటూ. ఈ రెండు వాక్యాలతో సీత కళ్యాణం ముందు ఉన్న ఘట్టాలన్నీ అలాగే కల్యాణం ముందు సీత ఏమి ఊహించుకొని ఉంటుందో అన్న ఊహ లోకి తీసుకెళ్తారు వేటూరి గారు. ఈ పాట పాడిన గాయత్రి మొత్తం పాట అద్బుతం గా పాడినా అరచేత గోరింట అన్నప్పుడు గోరింట అన్నప్పుడు స్పష్టం గా ఉండదు. ఇంత చక్కని కవిత్వానికి చెయ్యగలిగిన న్యాయం ప్రతి మాట స్పష్టం గా వినపడేలా పాడటమే.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో           || రామచక్కని సీతకి ||

వేటూరి గారి కల్పనా శక్తి కి హద్దు అంటూ ఉండదా? ఈ మూడు వాఖ్యాలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రాముడు అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అని అందరికి తెల్సిందే. ఆ శక్తి ఎటువంటిదంటే సీతా స్వయంవరం అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరు ఎత్తలేని శివ ధనుస్సుని  ఎడమ చేత్తో ఎత్తటం రాముని ప్రతాపానికి ప్రతీక. ఇంక రాముడు సీత కోసం లంక కి వెళ్ళేటప్పుడు సముద్రం మీద వంతెన కడ్తున్నప్పుడు అందరూ శక్తి వంచన లేకుండా రామకార్యం అని తలచి చేతనైన సహాయం చేసారు. ఆ క్రమంలో ఒక ఉడత కూడా సహాయం చెయ్యటం చూసి సంతోషంతో ఉప్పొంగిన రాముడు ఆ ఉడతని ఆప్యాయంగా చేత్తో తీసుకొని వీపు మీద వేళ్ళతో నిమురుతాడు. అప్పుడు పడిన గీతలు ఉడత జాతి మీద ఉండి పోతాయి. ఈ రెండు ఉదంతాలు ఎంత అద్బుతమైన పదాలతో చెప్తారో వేటూరి గారు. ఈ రెండు వాఖ్యాలకే కళ్ళు చమ్మగిల్లితే ముగింపు వింటే ఆయన కవితా పటిమకి అబ్బుర పడవలసిందే. శక్తి వంతమైన రాముని చెయ్యి ఎడమ చేత్తో శివధనస్సు ఎత్తుతాడు, ఉడత వీపున వేలు విడుస్తాడు, అటువంటి రాముడు సీతని పెళ్లాడతాడు అన్న అర్థం వచ్చేలా చెప్తారు పుడమి అల్లుడు రాముడే అని. సీత అమ్మ వారు భూదేవి కూతురు, భూమి నుంచి పుడ్తుంది కాబత్తి. సీతకి భర్త అయితే భూమాతకి అల్లుడే గా. కాని ఎడమ చేత్తో సీత జడను ఎత్తగలడా అన్న ప్రశ్న  సంధిస్తారు ఇదే అయన ఊహ శక్తికి నిదర్సనం. ఎందుకంటే తాళి కట్టటానికి రెండు చేతులు కావాలి, మరి తాళి కట్టేటప్పుడు తనంతట తానే జడని ఎత్తటం ఎవరికీ కుదరదు ఎంతటి బలవంతుడి కైనా శక్తిమంతుడి కైనా. ఉన్న రెండు చేతుల తో తాళి కడతే జడ ఎత్తటం ఎలా సాధ్యం? ఇటువంటి అద్భుతమైన ధర్మ సందేహం కలగటం వేటూరి గారి చమత్కారం అది కూడా నిఘూడం గా.

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపోశైనాడు దేవుడు నల్లని రఘురాముడు    || రామచక్కని సీతకి ||


ఇప్పుడు లంకకి ఇటువైపు రాముడు ఉంటె, అటువైపు సీతమ్మ వారు. రాముడి జాడ తెల్సినా ఎప్పుడు వస్తాడో తెలియదు, కాని వస్తాడని నమ్మకం. సీతమ్మ వారిని ఎర్ర జాబిలీ తో పోలుస్తారు, ఇది ఇంకో చమత్కారం. ఎర్ర జాబిలి  చెయ్యి గిల్లటం ఏమిటి అని అనిపించక మానదు. బాద తో కూడిన ఉక్రోషం తో కూడి ఎర్రగా కందిపోయిన ముఖం ఎరుపు గానే ఉంటుంది. జాబిలి లాంటి సీతమ్మని రాముడు ఏడి అని అడుగుతుంటే మాట ఒకటి అంటే కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. మనం ఏదైనా చెప్పొచ్చు కాని కళ్ళు అబద్దాన్ని దాచవు అంటారు. కళ్ళు ఏమి చెప్తున్నాయో చెప్తే మనం గమనించొచ్చు. ఇక్కడ రాముడి జాడ లేదు కనపడకుండా పోయాడు, ఆ మాట పెదవితో చూడలేదు అని చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తాయి రాముడు ఎక్కడున్నాడో తెలియదు అని. నల్ల పూసై నాడు దేవుడు నల్లని రఘు రాముడే. నీల మేఘ శ్యాముడు రాముడే గా అందుకని నల్లని రఘురాముడు అన్న ప్రయోగం అలాగే మనతో ఉండి కనపడకుండా పోయిన వాళ్ళని నల్ల పోశ అయ్యావు అంటారు. ఇది వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో బాగా ప్రయోగిస్తారు. అమావాస్య తరువాత చంద్రుడు వచ్చినా కనపడడు, అలాగే రాముడు ఉన్నాడు కాని కనపడడు అని సీతమ్మ అనుకుంటోంది అని అందం గా చెప్తారు 

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా  || రామచక్కని సీతకి ||

వేటూరి గారు చక్కని చుక్క అని సీతమ్మ వారిని అంటారు కానీ ఇక్కడ రాముడి కోసం సీత పడే తపన ఈ చరణం. చుక్కలని, దిక్కులని అడిగా రాముడు ఏడని, ఇంక బాధతో కూడిన కన్నులని అడిగితె అవి నీటి తో చెమ్మగిల్లాయి, వాటి నిండా కన్నీరే, ఏదైనా చెప్పటానికి ఆ కన్నీరే అడ్డుపడింది, మనసు నిండా ఉన్న రాముడుని చూసుకోవటానికి అడిగితె చెప్పటానికి రాముడు కనపడటం లేదని బాధ తో ఉన్న మనసు నుంచి మాటలు రావటం లేదుగా - ఎంతో ఆర్తితో రాసిన వేటూరి గారు, అంతే  ఆర్తి ధ్వనిస్తుంది ఈ చరణం లొ. 

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

వేటూరి గారు ఇందువదన కుందరదన అన్న పదాలతో ప్రయోగం చేసిన పాట ( చాలెంజ్ సినిమా లో ) వింటే ఆ పాట కి ఈ పాట కి ఎంత వ్యత్యాసమో కదా. మరల అవే పదాలు అటు ఇటు మార్చి ఒకసారి సీతని వర్ణిస్తే ఇంకో సారి ప్రశ్నిస్తారు ఎందుకమ్మా నీకు ఇంత  వేదన, ప్రేమ వలెనే కదా అని. అది పదాల మీద ఆయనకి ఉన్న పట్టు. సీతమ్మ వారిని చందమామ తో పోలుస్తారు ఒక సారి ఎర్ర జాబిలి  అంటారు ఇంకోసారి చంద్రుని వదనం కల దాన అంటారు ఒక సారి మంద గమన అంటారు ఇంకో సారి ఘన విచలన  అంటారు. అతిలోక సుందరి సీతమ్మ వారు నడిస్తే అత్యంత వయ్యారం గా ఉంటుంది, ఆ నడక చూస్తే కందిపోతుందేమో సీతమ్మ పాదం అన్నట్టు ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్న సీతమ్మ నీకు ఎందుకమ్మా ఇంట విచారం, రాముని మీద ప్రేమ వలెనే కదా? అయినా సీతమ్మని వర్ణించాలంటే ఒక జీవితం సరిపోతుందా? ఈ మాటల మాంత్రికుడి చేతిలో పదాలు మారి అర్థం మారేది శ్రోతల్ని అలరించటానికే సుమీ అన్నట్టు ఉంటాయి.
సేకరణ : మీ స్నేహ గీతం 



Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham